>

భారతీయ మిషనరీ సేవ పరిచర్యలో కలికితురాయి Great Milestone in the service of Christian Missionaries to India - Vellore Christian Medical College & Hospital

 భారతీయ మిషనరీ సేవ పరిచర్యలో కలికితురాయి CMC Vellore Hospital 
వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్... Christian Medical Colleg

🕎🕎🕎🕎🛐🛐🛐✝️✝️✝️

క్రీ.శ.1900 వ సంవత్సరం లో డాక్టర్. ఐడా.ఎస్.స్కద్దర్ ( Dr.Ida.S.Scudder) గారిచే తమిళనాడులోని వెల్లూర్ ప్రాంతంలో నెలకొల్పబడింది, ఈ సంస్థ స్థాపించి 118 సంవత్సరాలు గడుస్తున్నా, ఇన్నేళ్ళలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన కీర్తి ప్రతిష్టలు మరెన్నో గౌరవ పతాకాలను పొందింది...

20 వ శతాబ్ద ప్రారంభంలో తమిళనాడులో తీవ్రమైన కటిక పేదరికం, అనారోగ్యం, మరణాల శాతం ప్రమాదకర స్థాయిలో ఉండగా ప్రజల జీవన రేఖ 30 సంవత్సరాల దీన స్థితికి పడిపోయి వైద్యం అందని స్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్న వేళ "కారు చీకటిలో కాంతి రేఖలా" ఉదయించింది ఒక తార.

Christian Medical College - vellore


1870 లో జన్మించిన ఆ తార పేరేడా. ఐడా.ఎస్.స్కద్దర్, బ్రిటిష్ ఇండియాలోని తమిళనాడు ప్రెసిడెన్సీలో భాగమైన త్రివేండ్రంలో జన్మించిన ఐడా తల్లిదండ్రులు అమెరికా రిఫర్మేషన్ చర్చ్ రెండవ తరం మిషనరీ సువార్తికులు. వారు అమెరికా వాసులు అయినప్పటికి మిషనరీ సేవ పరిచర్య నిమిత్తం ఇండియా వచ్చి తమిళనాడులో సువార్త సేవ పరిచర్య సేవలు అందించేవారు. ఐడా తండ్రి జాన్ స్కదర్ వృత్తి రీత్యా వైద్యుడు.


ఇదిలా ఉండగా ఐడా 24 సంవత్సరాల ప్రాయంలో జరిగిన ఒక సంఘటన భారతీయ వైద్య చరిత్రనే మార్చేసింది.ఒక నాడు రాత్రి ఐడా తల్లిదండ్రులతో నిద్రిస్తున్న వేళా ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఇంటి ద్వారమునొద్ద బిగ్గరగా ఐడా తండ్రిని పిలుస్తూ "తన భార్య పురిటినొప్పులతో తీవ్ర వేదనకు గురి అవుతుంది గనుక ఐడా వచ్చి చూడాల్సిందిగా కోరాడు. కానీ అప్పటికి ఐడా కి వైద్యం ఏమి తెలియని స్థితి, కాగా ఐడా తన తండ్రి జాన్ వైపు చూడగా జాన్ "నేను వైద్యుడిని నేను వచ్చి సహాయం చేస్తాను అని ఆ వ్యక్తి తో చెప్పాడు " కానీ అప్పటి హైందవ సమాజంలో నెలకొన్న మూఢచారాల ప్రకారం ఒక స్త్రీకి పురుషుడు వైద్యం చేయడం అంగీకారం కాదు.

 గనుక ఆ యువకుడు ఆ సహాయాన్ని తిరస్కరించి వెళ్ళిపోయాడు. అదే రోజు మరో ఇద్దరు వ్యక్తులు అదే కారణం తో వచ్చి జాన్ సహాయాన్ని తిరస్కరించి వెళ్లిపోగా... ఆ రోజు మూడు మరణాలు సంభవించాయి. ఇది చూసి చలించిపోయిన ఐడా వారికి వైద్యం అందకనే ఇలా జరగవాల్సి వస్తుంది అని గ్రహించి. తాను కూడా వైద్యురాలు అయితే అందరికి సేవ చేయొచ్చు అనే ఒక తలంపు కలిగి, దేవుని పై భారం వేయగా ప్రార్ధనలో పిలుపు మేరకు వైద్యురాలు అవ్వాలని దృఢ నిశ్చయం కలిగి, అమెరికాలో వైద్య విద్యనభ్యసించుటకు 1895 లో పెంన్సేల్వేనియా ఉమెన్స్ వైద్య కళాశాలలో చేరి 1899 లో మొదటి తరగతి వైద్యవిద్య పట్టా అందుకుని, ఆలస్యం చేయక ఇండియా బయల్దేరి వచ్చింది.


ఇక అదే తడవుగా 1900 సం.లో తమిళనాడులో ఒక పడకతో చిన్న వైద్యశాలను ప్రారంభించిన ఐడా, అనారోగ్యుల తాకిడి మేరకు 1902 లో దాన్ని 40 పడకల ఆసుపత్రిగా మార్చి, "మేరీ తాబేర్ షెల్ మెమోరియల్ వైద్యశాల" అని ఆ ఆసుపత్రి నెలకొల్పడానికి ఆర్థికసహయాన్ని అందించిన న్యూయార్క్ దాత మరియు మిషనరీ యొక్క భార్య పేరుపై సేవలు ప్రారంభించింది. 1903 లో స్థానిక యువతులకు కాంపౌండర్ లు గా ట్రైనింగ్ ఇస్తూ వారితో మరెందరో సామాజిక దురాచారాలకులోనై వైద్యం అందని స్త్రీలకు వైద్య సేవలను విస్తరించడం ప్రారంభించింది.


చిన్న చిన్న మొబైల్ డిస్పెన్సరీలు ప్రారంభించిన ఐడా ప్రజల వద్దకె వెళ్లి వైద్య సేవలు అందించేందుకు తన బృందంతో పాటు వెల్లూర్ పరిసర ప్రాంతాల్లో సంచరించేది.1909 లో వైద్యశాలలో నర్సింగ్ ట్రైనింగ్ ప్రారంభించిన ఐడా, 1918 లో "యూనియన్ మిషన్ మెడికల్ స్కూల్" నెలకొల్పి యువతులకు ఫిజిషియన్ కోర్స్ ప్రారంభించింది.


ఇదిలా ఉండగా 1938 లో బ్రిటిష్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం " వైద్య కోర్సులను కేవలం యూనివర్సిటీలు మాత్రమే అందించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి, అయితే ఆ మిషన్ మెడికల్ స్కూల్ ని 1938లో "క్రిస్టియన్ మెడికల్ కాలేజ్(CMC)" అనే పేరుతో వైద్య చట్టం ప్రకారం అప్ గ్రేడ్ చేసి మద్రాస్ యూనివర్సిటీ గుర్తింపు క్రింద 1942లో MBBS కోర్స్ని అందించడం ప్రారంభించింది.


1945లో భారతీయ మొదటి ల్యాబొరేటరీ టెక్నీషియన్ ట్రైనింగ్ కోర్స్, 1946లో భారతీయ మొదటి నర్సింగ్ కాలేజ్, 1947 లో మొదటి పురుషుల నర్సింగ్ బ్యాచ్ ఇదే CMC కాలేజ్ లో ప్రారంభించబడ్డాయి.

1950 లో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు, 1969 లో నర్సింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అందించిన తొలి సంస్థగా CMC ఖ్యాతి గాంచింది.


క్రైస్తవ మిషనరీల సేవల్లో కలికితురాయిగా తమిళనాడు మరియు భారతీయ వైద్య చరిత్రలో గొప్ప వైద్య సంస్థగా ఎందరో ప్రజలకు ప్రాణధారినిగా కొనసాగుతున్న ఈ వైద్యాసంస్థ ప్రారంభించబడి 2000 నాటికి శతవసంతాలు పూర్తి చేసుకుంది.


ఈ సంస్థ యొక్క నినాదం(Motto):

పరిచారము చేయించుకొనుటకు రాలేదు గానీ పరిచారము చేయుటకొరకు వచ్చాము...

(మత్తయి సువార్త 20:28)


సంస్థ ఆసక్తికరమైన ప్రేరణ: ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను.


అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును...

(మత్తయి సువార్త 6:3,4)


ప్రార్ధన ఫలితమైన ఈ CMC వైద్య సంస్థ సాధించిన అద్భుత విజయాలు

......

ప్రపంచపు మొదటి Reconstructive Leprosy Surgery "రికన్స్త్ర క్టివ్ లెప్రొసీ సర్జరీ"- 1948

ఇండియా లో మొట్టమొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ -1961

ఇండియాలో మొట్టమొదటి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్-1971

ఇండియా మొట్టమొదటి కీలు మార్పిడి-1986

మొట్టమొదటి ABO సహిత కిడ్నీ మార్పిడి -2009


.....(ప్రస్తుతం ఈ కాలేజ్ నందు 175 విభాగాల్లో వైద్య కోర్సులు అందుబాటులో ఉండగా, 2600 విద్యార్థులు ప్రతిసంవత్సరం వైద్య విద్యనభ్యసిస్తూ ఉంటారు, 100 MBBS సీట్లు అందుబాటులో ఉన్నాయి .150 డిపార్ట్మెంట్ లు, 67 వార్డులు ఉన్న ఈ వైద్యశాల నందు ప్రతిరోజు 2000 ఇంపేషేంట్ 8000 అవుట్ పేషేంట్ వైద్య సేవలు జరుగుచుంటాయి. )

....

మరియు ఈ వైద్య సంస్థ యొక్క "డెవలప్మెంట్ సెంటర్ " ఎందరో ప్రముఖ వ్యక్తుల మన్ననలు అందుకోగా వారు స్వయంగా వచ్చి సందర్శించడం జరిగింది అందులో ప్రముఖులు

సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్

డా. జాన్ స్లేక్

అమెరికా ప్రఖ్యాత సువార్తికుడు బిల్లిగ్రేహం,

మహాత్మా గాంధీ

అప్పటి భారత ప్రధాని రాధాకృష్ణన్

బాబు రాజేంద్రప్రసాద్

అబ్దుల్ కలాం

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ

ఎడ్విన్ మౌంట్ బాటేన్


ఈ ప్రతిష్ఠాత్మక కాలేజీలో 2017 సంవత్సరానికి గాను ఒక్కరికే ప్రవేశం కల్పించారు.


వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెడికల్ కాలేజీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించిన ఈ విద్యా సంస్థకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

వందేళ్ల చరిత్ర గల ఈ మెడికల్ కాలేజీలోని వంద సీట్లకు దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు పోటీపడతారు. అయితే 2017 సం. మాత్రం ఒక్క విద్యార్థినే చేర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఒక జవాను కుమారుడు ఇందులో అడ్మిషన్ ఇచ్చారు...


అలాగే సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో 62 సీట్లకుగాను ఒక్కరికి మాత్రమే ప్రవేశం కల్పించింది. వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన జాతీయస్థాయి పరీక్ష నీట్ లో మంచి ర్యాంకు సాధించిన వారిని చేర్చుకోడానికి ససేమిరా అంటోంది.


ఈ కాలేజీ అధ్యర్యంలో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో 180 కి పైగా మిషన్ వైద్యశాలలను నడిపే ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చదవడాన్ని విద్యార్థులు ఎంతో గౌరవంగా భావిస్తారు. ఈ కళాశాల ఎలాంటి ప్రభుత్వ ఆర్ధిక సాయం లేకుండా పూర్తిగా ప్రపంచ క్రైస్తవ స్వచ్ఛంద విరాళాలతో నడుస్తుంది. ఈ మెడికల్ కాలేజీ వార్షిక ఫీజు కేవలం రూ. 3,000 లు అంటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ప్రభుత్వ ఫీజుల కంటే ఇది చాలా చాలా తక్కువ. ఏటా ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహించి, మతంతో సంబంధం లేకుండా మంచి మార్కులు సాధించిన వారి మెరిట్ ప్రకారం ఇంటర్వ్యూ చేస్తుంది.  ఈ ఇంటర్వూలో సేవాభావం కనబర్చిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది.


ఈ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులు ఆ సంస్థకు చెందిన గ్రామీణ ఆసుపత్రుల్లో కనీస వేతనంతో రెండేళ్ల పాటు తప్పనిసరిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రజలకు సేవ చేసి, వారి ఆదరణ పొందాలి. అలా ఉండాలంటే పేదల స్థితి గతులు తెలియాలి.... మార్కులు ఎక్కువ వచ్చిన ప్రతివారికి సేవ చేయాలనే ఆలోచన ఉండదని, నీట్ ఆధారంగా ప్రవేశాలను జరపడాన్ని వ్యతిరేకిస్తోంది. దీంతో 2017 ఏడాది మిగతా 99 సీట్లను ఖాళీగానే ఉంచేందుకు నిర్ణయం తీసుకుంది. నీట్ ను అంగీకరించినా... తమ కళాశాలలో ప్రవేశం పొందే విద్యార్థులను ఎంపిక చేసుకునే హక్కు తమకు ఉందని తమ కళాశాలలో అన్నీ పారదర్శకంగా ఉంటాయని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది.


సీఎంసీ CMC లో సీటును నీట్ ర్యాంకు ద్వారానే ఇస్తారు. దీనిలో మొత్తం సీట్లు- 100.

వీటిలో 42 సీట్లను బాలికలకు కేటాయిస్తారు, సీఎంసీ వెల్లూరు ఆల్ ఇండియా ఓపెన్ ఎంబీబీఎస్ సీట్లు- 16, భారత ప్రభుత్వం ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తుంది, ఆల్ ఇండియా ఓపెన్ ఎంబీబీఎస్ సీట్లలోని 20% సీట్లను ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు కేటాయిస్తారు, దీనిలోని మొత్తం స్పాన్సర్డ్ సీట్లు- 84...


నాటి నుండి నేటి వరకు భారతీయ వైద్య రంగం లో ఎనలేని సేవలు అందిస్తూ మిషనరీ సేవకు వన్నె తెచ్చిన ఐడా ఆశయ సౌధం, మూఢచారాలలో అణగారిన, పేద,ప్రజల జీవన ప్రదాయిని అయినటువంటి ఈ CMC వైద్య సంస్థ ని భారత దేశానికి ఐడా ద్వారా అందించిన దేవాది దేవుడైన, పరమ వైద్యుడైన క్రీస్తుకే మహిమ ప్రభావములు కలుగును గాక.


మిషనరీలు అంటే కేవలం బ్రిటీష్ వారని వారు మతమార్పిడి కోసం మాత్రమే వచ్చారని క్రైస్తవ్యం పై విషం చిమ్ముతున్న ఎందరో మతోన్మాదులకు , సంస్థలకు ఈ విషయం ద్వారా క్రైస్తవ మిషనరీల నిరాడంబరమైన సేవ పరిచర్యలపై కాస్తాయిన కనువిప్పు కలగాలని, క్రైస్తవ మిషనరీలు భారత దేశానికి చేసిన సేవలను ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోగలరు..


                🟧🟦🟨🟫🟥🟪🟩⬜⬛

Credit: Truth Research Center of India.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు