>

ఆదిమ సంఘానికి యేసు ప్రభు వారు ఇచ్చిన సూచనలు | The Lord Jesus' instructions to the early church

 అపొస్తలుల కార్యాలు 1 అధ్యాయం

acts 1 chapter

  • 1:1     నేపథ్య0
  • 1:2-3  యేసు తానను తాను సజీవునిగా కనపరచుకొనుట
  • 1:4-8   తండ్రి వాగ్దానానికి కనిపెట్టుట..
  • 1:9-14 యేసు పరలోక ఆరోహణ
  • 1:15-26 మత్తీయను శిష్యునిగా ఎన్నుకోవటం


1:1     నేపథ్య0


1 ఓ తియొఫిలస్✽, యేసు ఏమేమి చేయడానికీ ఉపదేశించడానికీ మొదలుపెట్డాడో వాటన్నిటిని గురించి నా మొదటి పుస్తకం వ్రాశాను. 


1:2-3  యేసు తానను తాను సజీవునిగా కనపరచుకొనుట


2 ✽ ఆయనను పరలోకానికి తీసుకువెళ్ళడం జరిగేవరకూ ఆ క్రియలు చేస్తూ ఉన్నాడు. చివరికి తాను ఎన్నుకొన్న✽ రాయబారులకు✽ పవిత్రాత్మ ద్వారా ఆదేశాలు ఇచ్చాడు. 3 ఆయన బాధల✽ తరువాత అనేక రుజువులచేత తనను సజీవంగా వారికి కనపరచుకొన్నాడు. నలభై రోజులపాటు ఆయన వారికి కనబడుతూ దేవుని రాజ్యానికి✽ చెందే విషయాలను గురించి ఉపదేశించాడు.


1:4-8   తండ్రి వాగ్దానానికి కనిపెట్టుట..


4 ✽ ఆయన వారితో సమావేశమై వారు జెరుసలం విడిచి వెళ్ళకూడదనీ తండ్రి వాగ్దానం చేసినదాని కోసం చూస్తూ ఉండాలనీ వారికి ఆజ్ఞాపించాడు, “దాని గురించి నా వల్ల మీరు విన్నారు. 

5 ✝ యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గాని కొన్ని రోజులలోగా మీరు పవిత్రాత్మలో బాప్తిసం✽ పొందుతారు” అన్నాడు.

6 ✽వారు అలా సమకూడినప్పుడు “ప్రభూ, నీవు ఇస్రాయేల్ ప్రజకు రాజ్యం మళ్ళీ అనుగ్రహించేది ఈ కాలంలోనా?” అని ఆయనను అడిగారు.

7 ✽అందుకు ఆయన వారితో అన్నాడు “తండ్రి తన అధికారంచేత కాలాలూ సమయాలూ నిర్ణయించాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. 8 ✽ అయితే పవిత్రాత్మ మిమ్ములను ఆవరించినప్పుడు మీరు బలప్రభావాలు పొందుతారు. జెరుసలంలో, యూదయ, సమరయ ప్రదేశాలలో నలుదిక్కులకు, భూమి కొనలవరకూ కూడా మీరు నాకు సాక్షులై✽ ఉంటారు.”


1:9-14 యేసు పరలోక ఆరోహణ


9 ✝ ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత వారు చూస్తూ ఉండగానే ఆయనను పైకి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన వారి కండ్లకు కనిపించకుండా మేఘం✽ ఒకటి ఆయనను ఎత్తుకు పోయింది. 

10 ✝ ఆయన పైకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారు ఆకాశంవైపు తేరి చూస్తూ ఉన్నారు. హఠాత్తుగా తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు పురుషులు వారి దగ్గర నిలిచి ఇలా అన్నారు:

11 ✽“గలలీ మనుషులారా! మీరెందుకు నిలుచుండి ఆకాశంవైపు చూస్తూ ఉన్నారు? మీ దగ్గరనుంచి యేసును పరలోకానికి చేర్చుకోవడం జరిగింది. ఈయన ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు.”

12 ✽అప్పుడు శిష్యులు ఆలీవ్ కొండ నుంచి జెరుసలంకు తిరిగి వచ్చారు. ఆ కొండ జెరుసలంకు దగ్గరగా విశ్రాంతి దినాన నడవతగినంత దూరాన ఉంది. 13 ✽పట్టణం చేరి వారు బస చేస్తున్న మేడగదిలోకి వెళ్ళారు. వారెవరంటే, పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్‌తొలొమయి, మత్తయి, అల్ఫయి కొడుకు యాకోబు, తీవ్రవాది సీమోను, యాకోబు కొడుకు యూదా. 14 ✽వీరంతా, వీరితోకూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియ, ఆయన తమ్ముళ్ళు ఏక మనసుతో నిలకడగా ప్రార్థన, విన్నపాలు చేస్తూ ఉన్నారు.

jesus ascending to heaven


1:15-26 మత్తీయను ఎన్నుకోవటం


15. సమకూడినవారి పేర్ల సంఖ్య సుమారు నూట ఇరవైమంది. ఆ కాలంలో ఆ శిష్యుల మధ్య పేతురు నిలబడి ఇలా అన్నాడు:

16 ✽“సోదరులారా, యేసును పట్టుకొన్నవారికి దారి చూపిన యూదాను గురించి పవిత్రాత్మ దావీదు ద్వారా పూర్వం పలికించిన లేఖనం నెరవేరవలసి వచ్చింది. 

17 ✝ అతడు మనలో ఒకడుగా ఎంచబడి ఈ సేవలో భాగస్థుడయ్యాడు. 18 ✽ (దుర్మార్గంవల్ల లభించిన డబ్బుచేత ఈ మనిషి ఒక పొలం కొన్నాడు. వాడు తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలయ్యాడు. వాడి పేగులన్నీ బయటికి వచ్చాయి. 

19 ఈ సంగతి జెరుసలంలో కాపురమున్న వారంతా తెలుసుకొన్నారు గనుక వారి భాషలో ఆ పొలానికి “అకెల్ దామ” అనే పేరు వచ్చింది. ఆ మాటకు రక్తభూమి అని అర్థం).

20 ✝ “కీర్తనల గ్రంథంలో ఈ విధంగా రాసి ఉంది: వాడి నివాసం పాడైపోతుంది గాక! దానిలో ఎవడూ బతకకుండా పోతాడు గాక! అతడి ఉద్యోగం మరొకరి పాలవుతుంది గాక. 21 ✽అందువల్ల ఒక విషయం తప్పనిసరి – యోహాను బాప్తిసం ఇచ్చిన కాలం మొదలుకొని యేసుప్రభువును మన దగ్గరనుంచి పైకి చేర్చడం జరిగేరోజు వరకూ – ఆయన మనమధ్య సంచారం చేస్తూ ఉన్న కాలమంతా – 22 మనతో కూడా ఉన్న పురుషులలో ఒకడు మనతోపాటు ఆయన పునర్జీవితానికి సాక్షి అయి ఉండాలి” అన్నాడు.

23 ✽అప్పుడు వారు యోసేపు, మత్తీయ అనే ఇద్దరిని నిలబెట్టారు (యోసేపుకు “యూస్తస్” అనే ఇంటి పేరు ఉంది. అతణ్ణి “బర్సబ్బా” అని కూడా పిలుస్తారు). 24 అప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఇలా అన్నారు: “ప్రభూ! అందరి హృదయాలు నీకు తెలుసు. 25 యూదా తన చోటికి వెళ్ళేందుకు అతిక్రమంవల్ల విడిచిపెట్టిన రాయబారి పదవిలో సేవలో పాల్గొనడానికి ఈ ఇద్దరిలో నీవు ఎన్నుకొన్నవాణ్ణి చూపించు.”

26 అప్పుడు వారిని గురించి చీట్లు వేశారు. మత్తీయ పేర చీటి వచ్చింది గనుక అతణ్ణి పదకొండుమంది రాయబారులలో ఒకడుగా ఎంచడం జరిగింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు