>

The Five Solas of the Reformation | సంస్కరణ యొక్క అయిదు 'మాత్రమే'లు | Five Solae | The Five Only

తెలుగులో ఐదు సోలాలు ఏమిటి | Five Solae 


మార్టిన్ లూతర్ తిరుగుబాటుకు కారణం ఏవో వ్యక్తిగత గొడవలో, చర్చి పాలిటిక్సో కాదు. అస్సలు వాక్యంతో సంబంధమే లేని ఆచారాలూ విధానాలూ చర్చి అవలంభిస్తుంటే లూతర్ తట్టుకోలేకపోయాడు. లూతర్ నిరసనకు కారణం దేవుని వాక్యమే. ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడు అనే విషయంలో కాథలిక్ బోధలు పూర్తి వాక్య విరుద్ధంగా ఉన్నాయి. పాప క్షమాపణకు సంబంధించి అప్పటి కాథలిక్ చర్చి మూడు మెట్లు బోధించేది. 1. చేసిన పాపాల్ని ఒప్పుకుని పశ్చాత్తాపపడాలి. 2. నీ పాపాలు క్షమించబడ్డాయని ప్రీస్ట్ తన నోటితో ప్రకటించాలి. 3. పాపానికి కలిగే తాత్కాలిక శిక్షకు పరిహారంగా ఏవైనా మంచి పనులు చేయాలి. అంటే సెయింట్స్ మృతదేహ అవశేషాలను సందర్శించాలి. పవిత్ర స్థలాలను దర్శించటం, రోజరీ ప్రార్ధనలు చేయటం, పాప పరిహార పత్రాలు కొనటం... వగైరా వగైరా. ఈ మూడింటిలో, మొదటి మెట్టు ఓకే. అది వాక్యానుసారం. కానీ, మిగిలిన రెండూ ఉన్నాయి చూసారా, అవి చాలా ఘోరం. దారుణం. చేసిన పాపాల్ని ప్రీస్ట్ కి ఎందుకు చెప్పాలి? పాపాలు క్షమించాయని ప్రీస్ట్ చెప్పడమేంటి? సెయింట్స్ మృతదేహాలు సందర్శిస్తే పుణ్యం వస్తుందా? ఫలానా భక్తుడి మృతదేహం భద్రంగా అక్కడ ఉంది, ఫలానా భక్తుడి చేతి ఎముక ఇక్కడ ఉంది, ఫలానా సెయింట్ పుర్రె ఆ దేశంలో ఉంది, అంచేత అవి పవిత్ర దేవాలయాలు, వాటిని సందర్శిస్తే పాపక్షమాపణ దొరుకుతుంది అనే బోధల్ని ఏమనాలి? సెయింట్స్ అని పిలవబడేవాళ్ళకి ప్రార్ధనలు చేస్తే దేవుడు వింటాడు, వాళ్ళ మధ్యవర్తిత్వం దేవుడు అంగీకరిస్తాడు, ఎందుకంటే వాళ్ళు సెయింట్స్ కాబట్టి. ఏం బోధ ఇది? సెయింట్స్ కి ప్రార్ధనలు చేయటమేంటి?  ఏం విధానాలివి? అందుకే మార్టిన్ లూతర్ ఆవేదన చెందాడు. వీటన్నిటి పైన చర్చలు నిర్వహించి, వాక్య విరుద్ధమైన వాటిని ఆపేద్దాం అని పిలుపు నిచ్చాడు. అందుకోసమే ‘95 తీసిస్’ రాసి, చర్చి గోడలకు తగిలించాడు.విచారకరం గా నాటి పోప్ అధికారం తన అవినీతి పథకాలను,ప్రజల్ని మోసం చేసే ముఢాచారాలను కొనసాగించాలనే అనుకుంది గాని,వాక్య ప్రకారం గా  చర్చి నీ దిద్దుబాటు చేసుకోవాలని అనుకోలేదు. దానతంటి ఫలితమే  సంస్కరణోధ్యమం. 

the five solas of reformation in telugu


అయిదు 'మాత్రమే'లు | The Five Only


రిఫార్మేషన్ గురించి మరికొన్ని సంగతులు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. రోమన్ కాథలిక్ చర్చికి, ప్రొటెస్టెంట్ ఉద్యమానికీ మధ్య ఉన్న వ్యత్యాసాల్ని మనం కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వ్యత్యాసాల్ని five solas అనే ఐదు లాటిన్ పదబంధాలతో వివరించే ప్రయత్నం చేసారు ప్రొటెస్టెంట్ సంస్కర్తలు. 'సోలా' అనే పదానికి ‘only/మాత్రమే/alone’ అని అర్ధం. ఈ అయిదు సోలాస్.. ఈ అయిదు మాత్రమే’లను ప్రతి క్రైస్తవుడూ తెలుసుకుని తీరాలి. రోమన్ కాథలిక్ చర్చి ఏ విషయాల్లో శృతి మించిందో, ఏ విషయాల్లో సరిదిద్దుకోవాలో, వాటిని వాక్యానుసారంగా క్రోఢీకరించి, five solas గా వివరించారు ప్రొటెస్టెంట్ సంస్కర్తలు.  

1. Sola scriptura (Scripture alone వాక్యం మాత్రమే) 2. Sola fide (Faith alone విశ్వాసం మాత్రమే) 3. Sola gratia (Grace alone కృప మాత్రమే) 4. Solo Christo (Christ alone క్రీస్తు మాత్రమే) 5. Soli Deo Gloria (to the glory of God alone మహిమ దేవునికి మాత్రమే). 

రిఫార్మేషన్ ప్రధానంగా రక్షణకు సంబంధించింది. సువార్తకు సంబంధించింది. ఈ రక్షణ సిద్ధాంతాన్ని, ఈ సువార్త సత్యాన్ని యథాతథంగా, వాక్యంలో ఉన్నదున్నట్టుగా, ఏమీ కలపకుండా, ఏమీ తీసేయకుండా ప్రజలకు అందించటమే ప్రొటెస్టెంట్ ఉద్యమం ప్రధాన లక్ష్యం.

రక్షణ సువార్త వాక్యంలోనే వెల్లడయ్యింది. ఒక వ్యక్తి ఎందుకు రక్షించబడాలో, ఎలా రక్షించబడతాడో చెప్పేది వాక్యం మాత్రమే. రక్షణ పూర్తిగా దేవుని కృప వల్లనే కలుగుతుంది. కృప ద్వారా మాత్రమే. రక్షణను మన సొంత క్రియల వల్ల పొందుకోలేం. విశ్వాసం ద్వారా మాత్రమే. రక్షణకు క్రీస్తే మార్గం. క్రీస్తే మూలం. క్రీస్తే ఆధారం. క్రీస్తు మాత్రమే. రక్షణ విషయంలో పూర్తి మహిమ దేవునికి మాత్రమే చెందుతుంది. దేవుని మాత్రమే. ఈ Five Solas కేవలం రిఫార్మేషన్ పదబంధాలే అనుకోవద్దు. ఇది మన విశ్వాస ప్రకటన. ఇది మన Faith Statement.

five solae in telugu


వాక్యం మాత్రమే | Sola Scriptura | Scripture Alone | Only Faith


కాథలిక్ వ్యవస్థకైనా, ప్రొటెస్టెంట్ వ్యవస్థకైనా, మరే ఇతర డినామినేషన్ కైనా బైబిలే ప్రామాణికంగా ఉండాలి. ఇది ఎవరైనా ఒప్పుకుని తీరాలి. వాక్యమే మనకు పునాది. మన జీవితాలపైన, మన కుటుంబాలపైన, మన సంఘాలపైన అంతిమ అధికారం బైబిలుదే. 

దేవుని రక్షణ ప్రణాళిక గురించి బైబిలే చెప్పింది. మనం ఎటువంటి భ్రష్ట పాపస్వభావం కలవాళ్ళమో బైబిలే చెప్పింది. మనం రక్షించబడటానికి దేవుడు ఏం చేసాడో, మనం ఏం చేయాలో బైబిలే చెప్పింది. మనల్ని దేవుని ఉగ్రత నుండి తప్పించటానికి, పాప శాప నరకాల నుండి రక్షించటానికి యేసుక్రీస్తు సిలువలో ప్రాయశ్చిత్తమయ్యాడని బైబిలే చెప్పింది. మనం క్రీస్తులో విశ్వాసముంచాలనీ, నిజమైన పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుని ఆయన క్షమాపణనీ రక్షణనీ వేడుకోవాలనీ బైబిలే చెప్పింది. మన రక్షణకూ, మన ఆత్మీయ జీవితానికీ అవసరమైన విషయాలన్నీ బైబిల్ స్పష్టంగా పేర్కొంది. మన క్రైస్తవ విశ్వాస జీవితానికి అవసరమైన ఉపదేశమంతటినీ బైబిలే పేర్కొంది. మనకు ఏది ఎంతవరకు అవసరమో, దాన్నంతటినీ అంతవరకే దేవుడు బైబిల్లో పొందుపర్చాడు. దీనికి ఏమీ కలపకూడదు. తీసివేయకూడదు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన వాక్యం మనకు పరిపూర్ణంగా సరిపోతుంది. దేవుని సత్యం వాక్యంలోనే దొరుకుతుంది. వాక్యానికి బయట మనం సత్యాన్ని వెతక్కూడదు. రాయబడిన లేఖనాలను అతిక్రమించకూడదని కొరింథీ పత్రిక హెచ్చరించింది. పోప్ మాటలు దేవుని వాక్యం కాదు. పాస్టర్ మాటలు దేవుని వాక్యం కాదు. బైబిల్ మాత్రమే దేవుని వాక్యం. నేనేది విశ్వసించాలో, ఏది విశ్వసించకూడదో, ఏది పాటించాలో, ఏది పాటించకూడదో నిర్ణయించేదీ నిర్దేశించేదీ బైబిల్ మాత్రమే. 

రిఫార్మేషన్ అనేది ఏదో ఒక కొత్త సిద్ధాంతం కాదు. నిజానికది, పాత పునాది సత్యాల వైపు మళ్లుదాం అనే ఒక చారిత్రాత్మక పిలుపు. back to scriptures అనే ఒక  ఉద్యమం.scriptures alone అనే మాట మీరు నమ్ముతారా? బైబిల్ మాత్రమే మన ప్రమాణం.బైబిల్ కాకుండా మరేది మన  ప్రమాణం కాదు అని మీరు ఒప్పుకొగలరా?

sola scripture in telugu


క్రీస్తు మాత్రమే | Christ Alone | Solo Christo


Solo Christo. క్రీస్తు మాత్రమే. క్రీస్తు మాత్రమే రక్షకుడు. రక్షణ క్రీస్తు ద్వారా మాత్రమే. ఆయన తప్ప మరెవరూ మనల్ని విమోచించలేరు. బైబిల్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. అపొ.కా. 4:12 వచనం అందరికీ తెలిసిందే. 'మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.' యోహాను 3:36 లో అపొస్తలుడైన యోహాను ఎంత సూటిగా చెప్పాడో చూడండి. 'కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి యుండును.' 

క్రీస్తే మన ప్రవక్త. క్రీస్తే మన ప్రధాన యాజకుడు. క్రీస్తే మన రాజు, ప్రభువు. క్రీస్తే మన రక్షకుడు. ఎందుకంటే మన పాపాలకు పరిహారం చెల్లించింది ఆయనే. మన అపరాధాలను మన మీద మోపకుండా, తానే భరించాడు. మనకు బదులుగా దేవుని ఉగ్రతను భరించింది ఆయనే. దేవునితో మనకున్న వైరాన్ని పరిష్కరించి, మనల్ని దేవునితో సంధిపర్చింది ఆయనే. మనం ఆయనలో దేవుని నీతి అవ్వటం కోసం, ఏ పాపమూ లేని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు (2 కొరింథీ 5:19-21). మన కోసం శాపగ్రాహి అయ్యింది క్రీస్తు ఒక్కడే. మనల్ని శాపం నుండి విడిపించింది క్రీస్తు ఒక్కడే. క్రీస్తు మాత్రమే (గలతీ 3:13). నశించినదాన్ని వెదకి రక్షించటానికి వచ్చింది ఆయనే (లూకా 19:10). ప్రజలను వారి పాపాల నుండి రక్షించేది క్రీస్తు మాత్రమే (మత్తయి 1:21). ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిందీ ఆయనే. సిలువ వేయబడిందీ ఆయనే. పునరుత్థానుడయ్యిందీ ఆయనే. ఆరోహణుడయ్యిందీ ఆయనే. తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడయ్యిందీ ఆయనే. క్రీస్తే మార్గం. క్రీస్తే సత్యం. క్రీస్తే జీవం. ఆయన ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రాలేరు. ఆయన్ని తెలుసుకుంటేనే దేవున్ని తెలుసుకోగలిగేది. మరో దారి లేదు(యోహాను 14:6-7).క్రీస్తు మాత్రమే. కేవలం క్రిస్తే. ఇది మనం  ఒప్పులేక పోతున్నాము అంటే సువార్త మనకు  అర్దం కాలేదనే.వాక్యం సరిగా చదవలేద నే.

విశ్వాసం మాత్రమే | Faith Alone | Only Faith | Sola Fide


అత్యంత పరిశుద్ధుడైన దేవుడు, ఒక ఘోర పాపిని నీతిమంతుడిగా ఎలా పరిగణిస్తాడు? విశ్వాసం ద్వారా మాత్రమే. క్రీస్తులో విశ్వాసం ఉంచటం ద్వారా మాత్రమే. బైబిల్లోని ఈ సత్యాన్నే ప్రొటెస్టెంట్ సంస్కర్తలు Sola Fide అంటూ పదే పదే గుర్తు చేస్తూ వచ్చారు. ఈ సత్యాన్ని గనక మనం విస్మరించామా, రక్షణ సిద్ధాంతాన్ని విస్మరించినట్టే. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం (Justification by faith), క్రైస్తవ విశ్వాసానికి చాలా కీలకం. సంఘం నిలబడుతుందా పడిపోతుందా అనేది ఈ ఒక్క సిద్ధాంతంపైనే ఆధారపడివుందని మార్టిన్ లూతర్ అన్నాడు. 

క్రైస్తవ విశ్వాసం విశిష్టత ఇదే. సిలువలో క్రీస్తు సంపూర్తి చేసిన ప్రాయశ్చిత్త విమోచనా కార్యంలో విశ్వాసముంచటమే క్రైస్తవ్యం ప్రత్యేకత. ఇతర మతాల్లో దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. భక్తిగా నిష్టగా పవిత్రంగా ఉండటానికి కొన్ని నియమాలు ఆచరించాలి. కొన్ని మానుకోవాలి. కష్టపడాలి. Efforts పెట్టాలి. వివిధ పద్ధతులు పాటించాలి. వివిధ ప్రయత్నాలు చేయాలి. కానీ, నీతిమంతుడిగా పరిగణించబడగటానికి ఒక పాపి చేసే ప్రయత్నాలు, అవి ఎంత గొప్పవైనా, అవి చెల్లవు అని బైబిల్ చెబుతోంది. మన సొంత ప్రయత్నాల ద్వారా నీతిమంతులవ్వటం కుదరదు. అసంభవం. మంచిపనుల ద్వారా, భక్తికార్యాల ద్వారా ఏ మనిషీ కూడా దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు (రోమా 3:20). 

యేసుక్రీస్తులో విశ్వాసముంచే వాళ్లందరికీ దేవుని నీతి కలుగుతుంది. ఇశ్రాయేలీయులు ఈ సత్యాన్నే విస్మరించారు. వారికి దేవుని నీతి విషయంలో అవగాహన లేదు. కాబట్టి తమ స్వంత నీతిని స్థాపించాలని చూసారు. దేవుని నీతికి విధేయత చూపలేదు. నీతి, క్రియల మూలంగా కలుగుతుందని ఇశ్రాయేలీయులు అనుకున్నారు. విశ్వాసమూలంగా మాత్రమే అని గ్రహించలేకపోయారు. 'విశ్వాస మూలమైన నీతి' గురించి పౌలు పదే పదే వివరించాడు (రోమా 9:30-32,10:4-7). ఈ సత్యాన్ని సరిగా అర్దం చేసుకోకుండా ,సువార్తను అర్దం చేసుకోలేం.మనం రక్షించబడేది ,విశ్వాసం ద్వారా మాత్రమే అని మీరు నమ్ముతున్నారా?

faith alone in telugu


కృప మాత్రమే | Grace Alone | Sola Gratia | Only Grace


రక్షణకు సంబంధించి బైబిల్ చెప్పే సత్యం ఇదే.. మనం క్రియల ద్వారా రక్షణ పొందలేం. కేవలం విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడుతున్నాం. విమోచించ బడటానికి ఒక పాపిలో ఎటువంటి యోగ్యతా లేదు. అతడు ఏ విధంగానూ దేవుని కృపను గెల్చుకోలేడు. ఏ విధంగానూ రక్షణను సంపాదించుకోలేడు. దేవుడే, తన కృప చూపి, ఉచితంగా మనకివ్వాలి. అర్హత లేనివాడికి దేవుడిచ్చే కృపాదానమే రక్షణ. దేవుడెవరికీ ఏ విషయంలోనూ రుణస్తుడు కాడు. రక్షణ విషయంలో ఇది మరింత సత్యం. నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నా కాబట్టి, నేను పశ్చాత్తాపపడ్డాను కాబట్టి.. అంటామా? అంత గొప్ప రక్షణ మన వల్ల కలిగిందా? కాదు కదా. నా ప్రమేయం ఎంతో కొంత ఉంది కదా అని నీకనిపిస్తుంటే, నీకు సువార్త అర్ధం కాలేదన్న మాట. రక్షణ మొదటి నుంచీ చివరి వరకూ పూర్తిగా దేవుని కార్యమే. అందులో మన పాత్రేమీ లేదు. ఆయన కృపతో ఉచితంగా ఇస్తుంటే, మనం విశ్వాసంతో స్వీకరిస్తున్నాం. ఇందులో మనం చేస్తున్నదేమీ లేదు. 

ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో దీని గురించి చాలా స్పష్టమైన వివరణ ఉంది. మనం అపరాధాలచే పాపాలచే చచ్చినవాళ్ళం. ఫలితంగా దేవుని శాపానికీ, శిక్షకూ గురయ్యాం. ఆయన న్యాయానికి మనం జవాబుదారీలం.  అపవాదికి బందీలయ్యాం. లోకానుసారంగా శరీరానుసారంగా మన ఇచ్ఛల ప్రకారం ప్రవర్తించాం. స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులయ్యాం. దేవుడు కరుణాసంపన్నుడు. తన మహా ప్రేమ చేత, కృప చేత మనల్ని రక్షించాడు. 'మీరు కృప చేతనే రక్షించబడియున్నారు' అని పౌలు భక్తుడు 5వ వచనంలోనూ ,8వ వచనంలోనూ రెట్టించి మరీ చెప్పాడు.   

'కృప చేతనే' అని మనం ఒప్పుకోలేకపోతే ఇక మన రక్షణకు ఆధారం ఏంటి? కృప లేకపోతే మనకు మిగిలేది శాశ్వత శిక్షే కదా. రోమా 3:24 వచనం ఎంత అద్భుతంగా ఎంత స్పష్టంగా ఉందో చూడండి. 'కాబట్టి, నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా  ఉచితముగా  నీతిమంతుల నీ తిర్చబడుచున్నారు.' grace alone  , కృప మాత్రమే అని మీరు కూడా గట్టిగా  చెప్పగలరా?

grace alone in telugu


మహిమ దేవునికి మాత్రమే | Soli Deo Gloria | Glory to God Alone


దేవుడే నా రక్షణ కోసం సంకల్పించాడు. తన అద్వితీయకుమారుని నాకోసం భూమి మీదకు పంపించాడు. నా పాపాలన్నిటికీ, సిలువలో ఆయనే ప్రాయశ్చిత్తం చేసాడు. ఆ రక్షణ సువార్తను నాకు వినిపించాడు. దేవుడే నన్ను ఆకర్షించాడు. పశ్చాత్తాపం నా హృదయంలో కలగటానికి ఆయనే కారణం. దేవుడే నాలో విశ్వాసం పుట్టించాడు. నేను విశ్వాసముంచినప్పుడు దేవుడే నన్ను నీతిమంతునిగా ప్రకటించాడు. నన్ను క్షమించాడు. విమోచించాడు. తన కుమారునిగా స్వీకరించాడు. ఇదంతా పూర్తిగా దేవుడు చేసిందే. రక్షణ కార్యం మొదటి నుంచీ చివరి దాకా complete గా దేవుని కార్యమే. ఈ క్రెడిట్, ఈ మహిమ పూర్తిగా దేవునికి మాత్రమే చెందాలి. ‘మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు’ అని ఎఫెసీ పత్రిక 2:8,9 వచనాలు స్పష్టం చేస్తున్నాయి. మనం గర్వించటానికి వీల్లేదు. మన విశ్వాసాన్ని బట్టో, మన భక్తిని బట్టో గొప్పలు చెప్పుకోవటానికి వీల్లేదు. మనకు అతిశయ కారణం లేనేలేదని రోమా పత్రిక 3:27 కూడా చెబుతోంది. రక్షణ కేవలం దేవుని కృప. మహిమ ఆయనకు మాత్రమే కలగాలి. విమోచించబడిన మనం, క్షమించబడిన మనం, తిరిగి జన్మించబడిన మనం దేవున్ని మహిమపర్చకుండా ఎలా ఉండగలం? ఒక నిజమైన విశ్వాసి, దేవునికి మాత్రమే మహిమ కలగాలని కోరుకోకుండా ఎలా ఉంటాడు? దేవుని కృప మనకు అర్ధమవుతున్న కొద్దీ, దేవునికి మరెక్కువగా మహిమ చెల్లిస్తూ ఉంటాం. మన ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని దేవున్ని మహిమపర్చేలా ఉండాలి. 'మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి' అని 1 కొరింథీ 10:31 ప్రోత్సహిస్తోంది. ఇది ఒకేసారి మనం సాధించలేకపోవచ్చు. కనీసం దేవునికి మహిమ కలగాలనే ఇష్టం అయినా మన మనసుల్లో ఉండాలి కదా. సకల మహిమ ఘనత ప్రభావము లు దేవునికే చెందాలి అని కోరుకుందామా?తండ్రియైన దేవునికి మహిమ కలగాలి. పరిశుద్దాత్మ అయిన దేవునికి మహిమ కలగాలి. త్రిత్వమైయున్న దేవునికి మహిమ కలగాలి.దేవునికి మాత్రమే కలగాలి. Soli Deo Gloria.

glory of god alone in telugu


Source: జీవితం by Suresh Vanguri


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు