>

సంస్కరణ దినం | The Reformation Day in Telugu | The 95 Theses of Martyn Luther King

Reformation by Martyn Luther King in telugu | మార్టిన్ లూథర్ కింగ్ ద్వారా సంస్కరణ

 ఇది 1517 నాటి మాట. రోమ్ లోని భవనాలకు మరి ముఖ్యంగా సెయింట్ పీటర్స్ చర్చికి పూర్వ వైభవాన్ని సంతరింపచేయాలని 'చర్చి' ఆలోచించింది. 'చర్చి' అంటే ఇక్కడ నా ఉద్దేశ్యం పోప్ హయాంలోని క్యాథలిక్ చర్చి అని. పాపపరిహార పత్రాల్ని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుని అందుకోసం వెచ్చించాలని చర్చి నిర్ణయించింది. ఈ వ్యవహారాన్ని నెరపడానికి జాన్ టెజెల్ అనే వ్యక్తికి అధికారమిచ్చింది. బహుశా మీలో కొందరికి, పాప పరిహార పత్రాలు atonement documents అంటే ఏంటి? అనే డౌట్ రావచ్చు. పాప పరిహార పత్రాలు ఒక సర్టిఫికెట్ లాంటివి. మీ పాపాలు క్షమించబడ్డాయి అని చర్చి ఇచ్చే ఒక ధ్రువీకరణ పత్రం అన్నమాట. అయితే ఇందులో తిరకాసు ఏంటంటే, ఆ పత్రాల్ని డబ్బులుకి అమ్మేవారు. ఎవరైతే దాన్ని ధర చెల్లించి కొనుక్కుంటారో, వాళ్ళ పేరు ఆ పత్రం మీద రాసి, పోప్ అధికార సీల్ ముద్ర వేసేవారు. ఆ సర్టిఫికెట్ నీ దగ్గర ఉంటే నీకు పరలోకం గ్యారంటీ అన్నట్టు. ఇదెంత వాక్యవిరుద్ధమో, డబ్బులు కోసం ప్రజల్ని ఎలా మోసం చేశారో గమనించండి. జాన్ టెజెల్ సారధ్యంలో సాగిన ఈ పాప పరిహార పత్రాల అమ్మకాలు, సహజంగానే మార్టిన్ లూతర్ హృదయాన్ని కలచివేశాయి. పాప పరిహార పత్రాల ద్వారా పాపాలు క్షమించబడతాయని ప్రజల్ని నమ్మించి మోసం చేయడాన్ని లూతర్ తట్టుకోలేక పోయాడు. లూతర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కేథలిక్ అధికారుల్ని ప్రశ్నించకుండా ఉండలేకపోయాడు. దాని ఫలితమే ‘ద 95 తీసిస్’ అనే కరపత్రం. లాటిన్ భాషలో చాలా ఘాటుగా రాసిన ఆ కరపత్రాన్ని కాసిల్ చర్చి తలుపులకు తగిలించాడు. రెండు వారాలు తిరక్కముందే, పోప్ విధానాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. నాడు డబ్బులు కోసం పాప పరిహార పత్రాల్ని అమ్మారు. నేడు డబ్బులు కోసం ఆశీర్వాద పథకాల్ని నడుపుతున్నారు కొందరు. యంగ్ పార్ట్నర్స్ ప్లాన్, బిజినెస్ బ్లెస్సింగ్ ప్లాన్, ఫామిలీ బ్లెస్సింగ్ ప్లాన్.. ఇవన్నీ అలాంటివే. డబ్బులిస్తే పరలోకాన్ని, ఆశీర్వాదాల్ని సంపాదించుకోవచ్చా? ఎంత మోసం. ఆలోచించండి.

reformation day - martyn luther king

                                   

హియర్ ఐ స్టాండ్!            |           Here I Stand

డబ్బులిస్తే పరలోకాన్ని, ఆశీర్వాదాల్ని సంపాదించుకోవచ్చనే మోసపూరిత విధానం నాటి కాథలిక్ చర్చిలోనే కాదు. నేడు మన ప్రాంతాల్లోనూ ఉంది. ‘వెయ్యి రూపాయలివ్వండి. దైవసేవకునితో కలిసి ఫోటో దిగండి. పాతిక వేలు ఇవ్వండి. దైవసేవకునితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చెయ్యండి. పదివేలు ఇవ్వండి. దైవసేవకుడు మీ ఇంటికి వచ్చి ప్రార్ధన చేస్తాడు. నెలకు వెయ్యి రూపాయలివ్వండి. ప్రతిరోజూ మీకోసం ప్రార్ధన చేస్తాం’.. ఇలాంటివి చేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. అలాంటివాళ్లకి మార్టిన్ లూతర్ లా మనమూ బుద్ది చెప్పాలి. వాళ్ళ బండారం బయటపెట్టాలి. నిలదీయాలి. ప్రశ్నించాలి. 1521లో పోప్ లియోx, లూతర్ని కాథలిక్ చర్చి నుండి బహిష్కరించాడు. దేశమంతటా పెద్ద వివాదం చెలరేగింది. లూతర్ని విచారణ చేయడానికి పోప్ అధికారులు సిద్ధమయ్యారు. లూతర్ తను రాసినవన్నీ తప్పులుగా ఒప్పుకుని, వాటిని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లూతర్ తనకు 24 గంటలు సమయం కావాలని అడిగాడు. లూతర్ భయపడిపోయాడనీ అందుకే గడువు కోరాడనీ, మరుసటి రోజు వచ్చి పోప్ ని క్షమాపణ అడుగుతాడేమోననీ కొందరు భావించారు. కానీ, చాలా ఆశ్చర్యంగా, మరుసటి రోజు విచారణలో, చక్రవర్తీ రాజులూ అధికారులూ అందరి సమక్షంలో లూతర్ తన చారిత్రాత్మక సమాధానం వినిపించాడు. “లేఖనాల్లోని రుజువులతో నన్ను ఒప్పిస్తే తప్ప, నేను ఉపసంహరించుకోను. ఎందుకంటే, మనస్సాక్షికి విరుద్ధంగా ఏది చేసినా అది క్షేమకరమూ కాదు, జ్ఞాన యుక్తమూ కాదు. Here I stand! I can do no other. God help me! Amen!! (ఇదే నా నిర్ణయం. ఇంతకు మించి నేనేమీ చేయలేను. దేవుడే నాకు సహాయం చేయాలి. ఆమెన్!).” ఎంత తెగువ కావాలి ఆ జవాబు చెప్పడానికి! ప్రాణాలు పణంగా పెట్టి లూతర్ పలికిన మాటలు కాథలిక్ చర్చి వ్యవస్థను కుదిపేశాయి. Here I stand! అనే ధిక్కార స్వరం ప్రపంచమంతా ప్రతిధ్వనించింది. నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది.

Here I stand - Martyn Luther king


1517 అక్టోబర్ 31న, అంటే, సరిగ్గా 504 సంవత్సరాల క్రితం, ఇదే రోజున మార్టిన్ తన 95 తీసిస్ ప్రదర్శించాడు. దానికి తీవ్ర పర్యవసానాలు ఉంటాయని లూతర్ కి తెలుసు. కాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ఒక పెద్ద కరపత్రాన్ని రాయటం చిన్నవిషయం కాదు. అది పోప్ అధికారాన్ని ప్రశ్నించటం. మరణాన్ని కొని తెచ్చుకోవటం. అయితే లూతర్ తెగించాడు. తన 95 తీసిస్ ద్వారా కాథలిక్ చర్చి అవినీతినీ, ఇతర వాక్య వ్యతిరేక విధానాల్నీ బాహాటంగా ప్రశ్నించాడు. కాథలిక్ చర్చి సమూలంగా సంస్కరించబడాలని పిలుపునిచ్చాడు. చర్చి విధానాల గురించి తనతో డిబేట్ కి రావాలని చర్చి పండితుల్ని సవాలు చేసాడు. 1521లో పోప్ లియోx, లూతర్ని బహిష్కరించాడు. లూతర్ని ఎవరైనా చంపొచ్చు అని అనుమతిస్తూ డెత్ వారంట్ జారీ చేశారు. లూతర్ స్నేహితులు అతన్ని ఒక రహస్యస్థలంలో దాచి పెట్టారు. అక్కడే జర్మన్ భాషలోకి కొత్త నిబంధన అనువాదాన్ని లూతర్ ప్రారంభించాడు. లూతర్ ద్వారా ప్రారంభమైన ఈ సంస్కరణోద్యమం ప్రపంచమంతటికీ వ్యాపించింది. కాథలిక్ గుత్తాధిపత్యం నుండి అనేకులు బయటికి వచ్చేసారు. ఫలితంగా వేలాది కొత్త సంఘాలు స్థాపించబడ్డాయి. కాథలిక్ విధానాల్ని ప్రొటెస్ట్ చేసినవాళ్ళని ప్రొటెస్టెంట్స్ అన్నారు. ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ వలన ఏర్పడిన సంఘాల్ని ప్రొటెస్టెంట్ సంఘాలు అన్నారు. లూతర్ ఎందుకు ప్రొటెస్ట్ చేసాడో మనకర్ధమైతే, రిఫార్మేషన్ ప్రాముఖ్యత మనకర్ధమవుతుంది. లూతర్ ప్రజల్ని తనవైపు లాక్కుని ఒక కొత్త డినామినేషన్ ప్రారంభించలేదు. బైబిల్ కి పూర్తి విరుద్ధంగా మారిపోయిన సంఘాన్ని సంస్కరించేందుకు పూనుకున్నాడు. అక్టోబర్ 31 ని Reformation Day, సంస్కరణ దినం అంటారు. ఎటువంటి వాక్యవిరుద్ధమైన ఆచారాల నుండి, ఎటువంటి నియంతృత్వపు విధానాల నుండి, ఎటువంటి అజ్ఞాన చీకటి కూపం నుండి మన పూర్వీకులు బయటపడ్డారో తలుచుకుంటే, ‘దేవా, మార్టిన్ లూతర్ కోసం వందనాలు' అని చెప్పకుండా ఉండలేం. Thank God for Martin Luther. Thank God for the Reformation.


Source : జీవితం by Suresh Vanguri Telugu Christian Podcast


అక్టోబర్ 31వ తేదీ క్రైస్తవoలో ప్రాటెస్టు సంఘాలకు చాలా ప్రాముఖ్యమైన రోజు. 1517లో ఈ దినాన మార్టిన్ లూథర్ తన 95 సిద్ధాంతాలను బహిరంగ చర్చకోసమని విటెన్ బర్గ్ దేవాలయ తలుపులమీద మేకులతో కొట్టాడు. ఈ సంఘటన క్రైస్తవ లోకంపైనే కాకుండా యావత్ ప్రపంచంపై తన ప్రభావాన్ని చూపింది. డాక్టర్ మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాల తెలుగు అనువాదం ఇక్కడ ఉంది.


the 95 thesis of martyn in telugu


డాక్టర్ మార్టిన్ లూథర్ 95 సిద్ధాంతాలు (చర్చనీయాంశాలు) | The 95 Theses in Telugu


  1. మన ప్రభువు బోధకుడైన యేసు క్రీస్తు “మారు మనస్సు పొందండి” అని అనటంలో, విశ్వాసుల యావజ్జీవితం పశ్చాత్తాపంతో కూడిందై ఉండాలన్నది ఆయన ఉద్దేశం.
  2. ఇది మత గురువులచేత ఆచరించబడే పాపాల్ని ఒప్పుకోవడం, తృప్తి పొందటం లాంటి సంస్కార సంబంధమైన పశ్చాత్తాపం లాంటిదని అనుకోకూడదు.
  3. ఇంకా దీన్ని అంతరంగంలో కలిగే పశ్చాత్తపమని కూడా అనుకోకూడదు. ఎందుకంటె శరీరాన్ని శుష్కింప చేసుకోడం లాంటి బాహ్య చర్యలద్వారా వ్యక్తపరచబడనప్పుడు అది అంతరంగ పశ్చాత్తాపం అనబడదు.
  4. కాబట్టి ఈ పాపశిక్షావిధి మనల్ని మనం త్యజించుకుంటున్నoత వరకూ కొనసాగుతూనే ఉంటుంది. ఏందుకంటే ఇధే నిజమైన అంతర్గత పశ్చాత్తాపం కనుక అది మనం పరలోకంలో ప్రవేశించేంతవరకూ కొనసాగుతుంది.
  5. సంఘ శాసనాల ద్వారా, తనకున్న అధికారం ద్వారా విధించే శిక్షల్ని తప్ప మిగిలిన వాటిని తగ్గించటానిక్కాని, తగ్గించాలనుకోటానిక్కాని పోపుకు వీల్లేదు.
  6. దేవుడు కొట్టేయ్యాలనుకొంటున్న శిక్షల్ని అవి దేవుడిచేత కొట్టెయ్యబడ్డాయని ప్రకటించడంతప్ప మరెలాంటి శిక్షనీ పోపు తగ్గించలేడు. ఇంకాచెప్పాలంటే తన తీర్పుకు లోబడిన శిక్షల్ని అతడు కొట్టెయ్యొచ్చు. అయితే శిక్షల్ని తగ్గించటానికి తనకున్న అధికారాన్ని అశ్రద్ధచేసి వాటిని కొట్టెయ్యకపోయినా అవతలివాడిలో పాపం అలాగే నిలిచుంటుంది.
  7. తనకు బదులుగా ఉన్న సంఘ గురువుకు అన్ని విషయాల్లో విధేయుడ్ని చెయ్యకుండా దేవుడెవరి శిక్షనూ కొట్టెయ్యడు.
  8. పశ్చాత్తాపానికి సంబంధించిన సంఘ శాసనాలు బ్రతికున్నవాల్లకు విధించటానికే తప్ప, ఆ శాసనాల ప్రకారం చచ్చిపోయినవాళ్ళకు విధించటానికి వీల్లేదు.
  9. అందుకే పోపు తన తీర్పుల్లో ఏప్పుడూ మరణానికి సంబంధించిన విధివిధానాల్లో మినహాయింపులు ఇచెలా పరిశుద్ధాత్ముడు మన పట్ల దయచూపిస్తున్నాడు.
  10. సంఘ శాసనాల ప్రకారం మరణ సమయంలో పాటించాల్సిన పశ్చాత్తప విధులు ప్రక్షాళన చెయ్యటానికి అట్టిపెట్టుకోనిచ్చే సంఘ గురువుల పనులు బుద్ధిలేనివి, దుర్మార్గమైనవి.
  11. సంఘ శాసనాలకు సంబంధించిన శిక్షా విధి ప్రక్షాళనకి సంబంధించిన శిక్షా విధిగా మార్చబడటం, బిషప్పులు తాము చెయ్యాల్సిన పనులు మాని నిద్రపోతున్నప్పుడు సంఘంలో విత్తబడ్డ ఓ కలుపు మొక్క లాంటిది.
  12. గతంలో సంఘశాసనాలకు సంబంధించిన శిక్షా విధులు నిజమైన పశ్చాత్తాపాన్ని పరీక్షించటం కోసం పాపక్షమాపణకు ముందే విధించబడేయిగాని తర్వాత కాదు.
  13. చనిపోతున్న వాళ్ళు తమ మరణాన్నిబట్టి అన్ని శిక్షావిధులనుండి విడుదల పొందుతారు. సంఘ శాసన విధుల విషయంలో సైతం వాళ్ళూ మ్రుతులే కాబట్టి వాటి నుండి కూడా విడుదల పొందే హక్కు వాళ్ళకుంటుంది.
  14. తమలోని ఆత్మీయ అనారోగ్యం, ఇంకోమాటలో చెప్పాలంటే అరకొరగా ఉన్న ప్రేమ చనిపోతున్న వారిలో మరింతగా భయాన్ని కలిగిస్తోంది. ప్రేమ తక్కువయ్యే కొద్దీ వాళ్ళలో భయం ఎక్కువౌతుంది.
  15. ఈ భయమూ భీతీ మహా నిరాశకు చేరువగా ఉంటాయి కాబట్టి పర్గెటరీలోని శిక్షావిధులన్నిటికీ ఇవే సరిపోతాయి.
  16. నిరాశ – నిరాశ పడటం – రక్షణ అభయం అన్నవి ఎలా వేరు వేరు అంశాలో అలాగే నరకం – పర్గెటరీ– పరలోకం కూడా వేరు వేరు విషయాలే.
  17. పర్గెటరీలోని ఆత్మల్లో భయం తగ్గి ప్రేమ పెరగటం అవసరమేమో అనిపిస్తుంది.
  18. ప్రేమలో ఎదిగి మంచి కార్యాలు చెయ్యగల స్థితిలో వాళ్ళు లేరు అని అంటానికి లేఖనపరమైన రుజువులేవీ లేవు.
  19. అలాగని తమ రక్షణ స్థితికి సంబంధించిన అభయాన్ని వాళ్ళు రూఢిగా కలిగి ఉన్నారని చెప్పటానిక్కూడా వీల్లేదు.
  20. కాబట్టి “అన్ని శిక్షావిధుల్నీ పూర్తిగా కొట్టెయ్యడం” అనే విషయం “అన్నిటికీ” కాకుండా “తనచేత విధించబడిన వాటికి మాత్రమే” వర్తిస్తుందని పోపు భావిస్తున్నాడు.
  21. కాబట్టి పోపు ఇచ్చే పాప పరిహార పత్రికల ద్వారా ఒక వ్యక్తి అన్ని శిక్షా విధుల్నుండి విడిపించబడి రక్షించబడతాడని చెప్పే పాపపరిహార పత్రికల బోధకులందరూ అబద్ధీకులే.
  22. నిజానికి సంఘశాసనాల ప్రకారం తాము బ్రతికున్నప్పుడు పొందాల్సిన శిక్షా విధుల్లో ఇంకా మిగిలిపోయిన వాటిల్లో దేన్నికూడా పర్గెటరీలోని ఆత్మల విషయంలో పోపు కొట్టెయ్యలేడు.
  23. ఒకవేళ అన్ని శిక్షావిధులూ కొట్టివెయ్యబడటం అంటూ జరిగితే అది కేవలం సర్వ సంపూర్ణులైన వాళ్ళకు మాత్రమే దక్కుతుంది. అయితే అలాంటి వాళ్ళు ఏకొద్దిమందో ఉంటారు.
  24. కాబట్టి ప్రాయశ్చిత్తానికి సంబంధించిన అన్ని శిక్షా విధుల్నుండి విడుదల పొందుతారని చెప్పబడే వాగాఢంబరమైన, అవివేక వాగ్ధానాలవల్ల చాలామంది మోసపోతున్నారు.
  25. మొత్తానికి పోపుకు పర్గెటరీ మీదున్న అధికారం, ప్రతీ బిషప్పుకూ తన అసెంబ్లీ మీద, ప్రతీ పాస్టరుకు తన చర్చి పరిధిలో వున్న ప్రాంతం మీద ఉన్న అధికారం వంటిదేనని చెప్పొచ్చు.
  26. పోపు పర్గెటరీలోని ఆత్మలకు పాపక్షమాపణ ఇచ్చేప్పుడు దాన్ని తనకున్న తాళపుచెవుల అధికారాన్నిబట్టి కాక విజ్ఞాపన ద్వారా ఇవ్వటం మంచిది.
  27. చందా పెట్టెలో డబ్బులు గలగలమనగానే పర్గెటరీలోంచి ఆత్మ రయ్యిమంటూ ఎగిరిపోతుంది అని చెప్పే బోధ మానవ కల్పితమైంది.
  28. చందాపెట్టెలో డబ్బులు గలగల లాడటంవల్ల లాభమూ లోభీతనమూ రెండూ పెరుగుతాయి. అయితే సంఘం యొక్క విజ్ఞాపనల ఫలితం మాత్రం దేవుని శక్తికి మాత్రమే లోబడి ఉంటుంది.
  29. పరిశుద్ధులైన సెవేరినస్ పాస్కల్ కు సంబంధించిన ఇతిహాసంలో చెప్పబడ్డట్టుగా పర్గెటరీలోని ఆత్మలన్నీ విడిపించబడటానికి ఇస్టపడుతున్నట్టు ఎవరికి తెలుసు?
  30. తన పశ్చాత్తాపం మనహ్ పూర్వకమైందనిగాని, తన పాపాలు సంపూర్ణంగా క్షమించబడ్డాయని గాని ఎవ్వరూ కచ్చితంగా చెప్పలేరు.
  31. యదార్ధంగా పశ్చాత్తాప పడేవాళ్ళు ఎంత అరుదుగా ఉంటారో అలాగే పాప క్షమాపణా పత్రాలు నిజంగా పాపాల్ని పరిహరిస్తాయని నమ్మి వాటిని కొనేవాళ్ళు కూడా అంతే అరుదుగా ఉంటారు.
  32. పాప క్షమాపణా పత్రాలు తమ దగ్గరున్నందున తమకు రక్షణ కలుగుతుందని నమ్మేవాళ్ళు, అలా బోధించేవాళ్ళూ నిత్య నాశనం పొందుతారు.
  33. పోపు ఇచ్చే పాపక్షమాపణ దేవునితో మానవుడ్ని సమాధానపర్చే ఓ అమూల్యమైన వరమని బోధించేవాళ్ళ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
  34. ఎందుకంటే ఈ “క్షమాపణా క్రుపలు” కేవలం మనుషులు నియమించిన సంస్కార సంతృప్తికి సంబంధించిన శిక్షావిధులకు చెందినవి.
  35. డబ్బులిచ్చి ఆత్మల్ని పర్గెటరీలోంచి విడిపించాలనుకుంటున్న వాళ్ళు లేదా పాపపుటొప్పుకోలు పత్రికలు కొన్నవాళ్ళు ఇక ఏమాత్రం పశ్చాత్తాపపడనవసరం లేదని చెప్పేవాళ్ళు క్రైస్తవ సిద్ధాంతాన్ని బోధించటం లేదు.
  36. పాప క్షమాపణ పత్రికలతో నిమిత్తం లేకుండానే అన్ని శిక్షా విధుల్నుండి, అపరాధం నుండి విడుదల పొందే హక్కు నిజంగా పశ్చాత్తాపం చెందే ప్రతీ క్రైస్తవునికీ ఉంటుంది.
  37. పాప క్షమాపణ పత్రాలతో నిమిత్తం లేకుండా నిజమైన ప్రతి క్రైస్తవుడూ – సజీవుడైనా – మ్రుతుడైనా – దేవుడనుగ్రహించిన క్రీస్తు యొక్క, సంఘం యొక్క సకలాశీర్వాదాలలో పాలిభాగస్తుడై ఉంటాడు.
  38. అలాగని పోపు ఇచ్చే పాపక్షమాపణ, ఆశీర్వాదాలను ఎంతమాత్రం తక్కువైనవిగా ఎంచకూడదు. ఏందుకంటే నేను ఇదివరకే చెప్పినట్టు అవి దేవుడిచ్చే పాప క్షమాపణల యొక్క ప్రకటనలై ఉన్నాయి.
  39. నిజ పశ్చత్తాపం యొక్క అవసరం గురించి, సమ్రుద్ధిగా దొరికే పాప క్షమాపణల గురించి ఒకేసారి ప్రజలకు వివరించి చెప్పటం ఎంతగొప్ప వేదాంత పండితుడికైనా సరే చాలా కస్టమైన పని.
  40. నిజమైన పశ్చ్చాత్తాపం శిక్షా విధుల్ని కోరుకుంటుంది, ప్రేమిస్తుంది. ఆయితే విచ్చలవిడిగా దొరికే పాప క్షమాపణా పత్రికలు శిక్షా విధుల తీవ్రతని తగ్గించటమేకాక ఒక్కోసారి ఆ పత్రికల మీద అసహ్యం కలిగేలా చేస్తాయి.
  41. ప్రేమతోకూడిన ఇతర మంచి కార్యాల కంటే కూడా పాప క్షమాపణా పత్రాలు మంచివని ప్రజలు అపోహ పడకుండా వాటి గురించి చాలా జాగ్రత్తగా బోధించటం అవసరం.
  42. పాపపరిహార పత్రికల్ని కొనడం ఏమాత్రం కనికరయుత కార్యాలతో పోల్చదగింది కాదన్నది పోపు అభిప్రాయమని క్రైస్తవులకు బోధించాలి.
  43. పేదలకు సాయం చేసేవాడు, అవసరంలో ఉన్నవాళ్ళకి అప్పిచ్చేవాడు పాపపరిహార పత్రికల్ని కొనడంకంటే కూడా మంచి పనిచేస్తున్నాడని క్రైస్తవులకు బోధించాలి.
  44. ఎందుకంటే ప్రేమపూర్వకమైన పనులు మరింతగా ప్రేమను పెంచి ఒకడ్ని మంచి వాడ్ని చేస్తాయి. అయితే పాపపరిహార పత్రికలు కొనడంద్వారా కేవలం శిక్షావిధుల్నుండి తప్పించబడతాడేగాని మంచివాడు మాత్రం కాలేడు.
  45. అవసరంలో ఉన్నవాడ్ని చూసికూడా ముఖం తప్పించివెళ్ళి, పాపపరిహార పత్రికలు కొనేవాడు పోపు ఇచ్చే క్షమాపణ్ణీ కాదుగాని, దేవుని ఉగ్రతనే కొంటున్నాడని క్రైస్తవులకు బోధించాలి.
  46. తమ స్వంత కుటుంబ అవసరాలకు చాలినంత అట్టిపెట్టుకున్నాక, ఇంకా తమ అవసరాలకు మించి ఏమైనా మిగిలిపోతే ఆ డబ్బుతో పాపపరిహార పత్రికలు కొనొచ్చుగాని అనవసరంగా డబ్బులు పాడుచేసుకోకూడదని క్రైస్తవులకు బోధించాలి.
  47. పాప పరిహార పత్రికల్ని కొనటం తమ ఇస్టాయిస్టాలమీద ఆధార పడిందే తప్ప అదేమీ ఆజ్ఞా పూర్వకమైంది కాదని క్రైస్తవులకు బోధించాలి.
  48. ప్రజలు తెచ్చే డబ్బు కంటే కూడా భక్తియుత మైన వాళ్ళ ప్రార్థనలు తనకెంతైనా అవసరమని, అవే పోపు కోరుకొంటున్నాడని క్రైస్తవులకు బోధించాలి.
  49. పాపపరిహార పత్రాల మీద నమ్మకముంచక పోయినా అవి కొన్నవాళ్ళకు ఉపయోగకరంగా ఉంటాయిగాని, వాటిని బట్టి దేవుని మీద వాళ్ళకుండాల్సిన భయభక్తులు తగ్గిపోతేమాత్రం అవే వాళ్ళకు హానికరమౌతాయని క్రైస్తవులకు బోధించాలి.
  50. పాపక్షమాపణా పత్రికల్ని బోధకులు ఎంత నిర్బంధంగా అమ్ముతున్నారో పోపుకుగనక తెలిస్తే, తన గొర్రెల (సంఘస్తుల) రక్తమాంసాలతో పరిశుద్ధ పేతురు దేవాలయం కట్టబడటంకంటే అధి కాలి బూడిద కావటానికే పోపు ఇష్టపడతాడని క్రైస్తవులకు బోధించాలి.
  51. పాపక్షమాపణ పత్రికలమ్మేవాళ్ళు మోసపు మాటలు చెప్పి ప్రజలసొమ్ము దోచుకుంటున్న సంగతి పోపుకు గనక తెలిస్తే తన స్వంత డబ్బుల్తోపాటు అవసరమైతే పరిశుద్ధ పేతురు దేవాలయాన్ని సైతం అమ్మి వాళ్ళ డబ్బు వాళ్ళకు తిరిగివ్వటం తన ధర్మంగా పోపు భావిస్తాడని క్రైస్తవులకు బోధించాలి.
  52. ఈ పత్రికల్ని సరఫరా చేసేవాళ్ళుగాని, లేదా చివరికి పోపుగాని వాటిమీద తమ ఆత్మల్ని పణంగా పెట్టినప్పటికీ పాపక్షమాపణ పత్రికల ద్వారావచ్చే రక్షణ అభయం వ్యర్థమైందే.
  53. పాపక్షమాపణ పత్రికల గురించి చెప్పటంకోసం కొన్ని దేవాలయాల్లో దేవుని వాక్యం బోధింపబడకుండా ఆటంక పెట్టే వాళ్ళూ క్రీస్తుకు, పోపుకు విరోధులు.
  54. ఒక ప్రసంగంలోనే దేవుని వాక్యంతో సమానంగా గాని, లేదా ఎక్కువగా గాని పాపపరిహార పత్రాల గురిచి చెప్పటానికి సమయాన్ని వెచ్చించినప్పుడు అది దేవుని వాక్యాన్ని కించపర్చినట్లవుతుంది.
  55. చాలా చిన్నపాటి విషయమైన పాపక్షమాపణ పత్రాలకోసం ఒక గంటకొట్టి, ఓ వూరేగింపుచేసి, కొన్ని కర్మకాండలు జరిపినప్పుడు మహత్తరమైన సత్య సువార్తను ప్రకటించటం కోసం వందగంటలు కొట్టి, వంద వూరేగింపులు జరిపి వంద కర్మకాండలు చెయ్యాలని పోపు తలంచాలి.
  56. ఏ సంఘ ఖజానాలోంచి తీసి ఈ పాపపరిహార పత్రికల్ని పోపు ఇస్తున్నాడో అది ప్రస్తావించబడలేదు,  ప్రజలకు దాన్నిగురించి ఏం చెప్పబడలేదు.
  57. చాలామంది బోధకులు ఈ ఖజానాలోని మూలధనాన్ని ఇష్టమొచ్చినట్టు వాడిపారేయకుండా ఎంతో జాగ్రత్తగా సమకూర్చటం చూసినప్పుడు ఈ ఖజానాలోని ధనం కచ్చితంగా ఈలోక సంబంధమైంది కాదని అనిపిస్తుంది.
  58. ఈ ఖజానాలోని మూలధనం క్రీస్తుకు, పరిశుద్ధులకు చెందిన పుణ్య ఫలమేమీ కాదు. ఎందుకంటే పోపుతో నిమిత్తం లేకుండానే ఇది అంతరంగపురుషుడికి క్రుపను, బాహ్యపురుషుడికి సిలువ, మరణం, నరకాలను ఇస్తుంది.
  59. సంఘంలోని పేదవాళ్ళే సంఘానికి నిజమైన ఖజానా అని పరిశుద్ధుడైన లారెన్స్ అన్నాడు. అయితే తన కాలంలో ఆ మాటకున్న వాడుకని బట్టి ఆయన అలా అన్నాడు.
  60. ఈ లోకంలోనూ పరలోకం లోనూ బంధించటానికి, విప్పటానికి సంఘానికి క్రీస్తు అనుగ్రహించిన తాళపు చెవుల అధికారమే ఆ ఖజానాకి మూల ధనమని మేము చెప్పటంలో తొందరపాటు తనమేమీ లేదు.
  61. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పాపవిధుల్ని కొట్టెయ్యడానికి పోపుకు స్పస్టమైన అధికారం చాలినంతౌంది.
  62. మహిమతో నిండిన మహాపరిశుద్ధమైన సువార్త, దేవుని క్రుప ఇవే సంఘానికి నిజమైన ఖజానా.
  63. ఇది మొదటి వాళ్ళని చివరివాళ్ళగా చేస్తుంది కాబట్టి సహజంగానే చాలామంది దీన్ని అసహ్యించుకుంటారు.
  64. అయితే పాపపరిహార పత్రికల ఖజానా చివరివాళ్ళని మొదటివాళ్ళగా చేస్తుంది కాబట్టి సహజంగానే దీన్ని అందరూ మెచ్చుకుంటారు.
  65. కాబట్టి సువార్త అనే ఖజానా గతంలో ధనవంతుల్ని దేవునికోసం పట్టే వల వంటిదై ఉంది.
  66. ఇప్పుడైతే ఈ పాపపరిహార పత్రికల ఖజానా ధనంకోసం మనుషుల్నిపట్టే వలలాంటిదై ఉంది.
  67. ఇవి మహాగొప్ప క్రుపలు అంటూ బోధకులు కేకలుపెట్టి చెప్పే ఈ పాపపరిహార పత్రికలు నిజంగానే గొప్పవేమో అనిపిస్తుంది. ఏందుకంటే ఇవి దండిగ లాభాలు తెచ్చిపెడుతున్నాయి గదా!
  68. అయితే దేవుని క్రుప పట్ల, సిలువ పట్ల ఉన్న విశ్వాసాలతో పోలిస్తే నిజానికివి చాల చిన్నపాటి క్రుపలు.
  69. బిషప్పులు, చిన్న పాదుర్లు ఈ పాప పరిహార పత్రికల్ని సరఫరా చేసే వాళ్ళని గౌరవంగా తమ దగ్గరకు చేర్చుకోవాల్సిందే!
  70. కానీ పోపు చెప్పమన్నదానికి బదులుగా తమస్వంత కల్పితాలు చెపుతున్నప్పుడు మాత్రం వాళ్ళమీద ఒకన్నేసి ఉంచాల్సిన బాధ్యత వాళ్ళమీదుంది.
  71. ఈ పాపపరిహార పత్రికలను గురిచిన వాస్తవాల్ని వ్యతిరేకించేవాడు దౌర్భాగ్యుడు, శాపగ్రస్తుడు.
  72. అలాగే ఈ పాపపరిహార పత్రికలమ్మే బోధకుల దురాశల్ని, విచ్చలవిడితనాన్ని ఖండించేవాడు ధన్యుడు.
  73. ఈ పాపపరిహార పత్రికల జోరును ఆపటానికి నేర్పుగా ఉపాయాలుపన్నే వాళ్ళమీద సహజంగా పోపు ఎంత మండి పడతాడో..
  74. అంతకంటే ఎక్కువగా పాపపరిహార పత్రికల్ని సాకుగా పెట్టి పరిశుద్ధ ప్రేమను, సత్యాన్ని అడ్డగించే వాళ్ళమీద పోపు మండిపడతాడు.
  75. దేవమాతను చెరపడం లాంటి అసాధ్యమైన పాపం చేసినవాడ్ని సైతం క్షమించేంత గొప్పవి ఈ పాపపరిహార పత్రికలు అని అనుకోటం వెర్రితనం.
  76. దానికి బదులుగా మెమేం చెపుతున్నామంటే – అపరాధానికి సంబంధించి క్షమించదగిన అతి చిన్న పాపాన్ని సైతం పాపపరిహార పత్రికలు తీసెయ్యలేవు.
  77. పరిశుద్ధుడైన పేతురు ఇప్పుడు పోపుగా ఉన్నాసరే ఇంతకు మించిన మహాక్రుపలేవీ ఇవ్వలేడని చెప్పటం పరిశుద్ధుడైన పేతురుకి, పోపుకు వ్యతిరేకంగా చేసే దైవ నింద.
  78. దానికి బదులుగా మళ్ళీ మేమేం చెపుతున్నామంటే – ఇప్పుడున్న పోపు మాత్రమే కాకుండా ఇంకా ఏ పోపైనా సరే మొదటి కొరింథీ పత్రిక 12 అద్యాయంలో చెప్పబడ్డ సువార్త, ఆత్మశక్తులు, స్వస్తతా వరంలాంటివి కలిగుంటే పాపపరిహార పత్రికలిచ్చే వాటికంటే మరిన్ని క్రుపల్ని వాళ్ళివ్వ గలరు.
  79. పాపపరిహార పత్రికల్ని శ్రుంగారించటానికి వాటినమ్మే బోధకులు ఆ పత్రికల మీద వేసిన పోపు ముద్రలో ఉన్న శిలువగుర్తుకు, క్రీస్తు శిలువతో సమానమైన శక్తి ఉన్నదని చెప్పటం దేవుడ్ని నిందించటమే అవుతుంది.
  80. ఇలాంటి తప్పుడు బోధలు ప్రజల్లో వ్యాపిస్తుంటే చూస్తూ వూరుకొనే బిషప్పులు, చిన్న పాదుర్లు, వేదాంతులు దేవుడికి లెక్క అప్ప చెప్పాల్సిన వాళ్ళై ఉన్నారు.
  81. పాపపరిహార పత్రికల గురించి అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ఈ ప్రచారం వల్ల తన మీద పడే అభాండాల కారణం గాను, సంఘస్తులు యుక్తిగా వేసే ప్రశ్నల కారణం గాను పోపు పోగొట్టుకుంటున్న గౌరవాన్ని కాపాడటం జ్ఞానవంతులకు సైతం కష్టసాధ్యమైన పని.
  82. వరసగా చెప్పాలంటే:- గుడికట్టటానికి దిక్కుమాలిన డబ్బు సంపాదించటం కోసమని పర్గెటరీలొంచి ఆత్మల్ని విడిపించటానికి బదులుగా పరిశుద్ధమైన ప్రేమను బట్టి, ఆత్మలకున్న అ ఘోరమైన అక్కరనుబట్టి పోపు ఎందుకు పర్గెటరీని ఖాళీ చెయ్యకూడదు? మొదటిదేమో తుచ్చమైంది, రెండోదేమో సమంజసమైంది.
  83. విడుదల పొందిన ఆత్మలకోసం ప్రార్థన చెయ్యటం తప్పుకదా, అలాంటప్పుడు చచ్చిపోయినవాళ్ళ కోసం సంస్మరణ ఆరాధనలు, సాంవత్సరిక ఆరాధనలు ఇంకా జరిగించటం ఎందుకు? వాళ్ళ పేరుతో దాన ధర్మాలు చెయ్యటానికి ఏర్పాటుచేసిన జ్ఞాపకార్ధ నిధుల్ని తిరిగి ఇచ్చెయ్యటం గాని, లేదా వాళ్ళ బంధువులు ఆ డబ్బును వాపసు తీసుకోటానిగ్గాని ఎందుకు అనుమతించరు?
  84. ఇంకా:- దేవుడికిష్టమైన భక్తుడి ఆత్మని ఆ ఆత్మకున్న స్వంత అవసరాన్నిబట్టి, శుద్ధమైన ప్రేమతో విడిపించటానికి బదులుగా అవిశ్వాసి, విరోధి అయిన ఓ వ్యక్తి డబ్బిచ్చి ఆ ఆత్మను పర్గెటరీ లోంచి విడిపించేందుకు అనుమతించటంలో దేవుడికి, పోపుకు ఉన్న ఈ సరికొత్త భక్తి సూత్రం ఏంటి?
  85. ఇంకా:- నిజానికి పశ్చ్చత్తాపానికి సంబంధించిన సంఘ శాసనాలు చాలాకాలంగా వాడుకలోలేనందున కొట్టివేయబడి మ్రుతమైన స్థితిలో ఉన్నప్పుడు, అవింకా బ్రతికే ఉన్నట్టు, వాటికింకా సత్తా ఉన్నట్టు పాప పరిహార పత్రికలిచ్చి ఇప్పుడు తృప్తిపరచటమెందుకు?
  86. పేద విశ్వాసుల డబ్బుతోకాక ఒకప్పటి మహా ధనవంతుల సంపదకు మించిన ఆస్తి పాస్తుల్ని కలిగున్న పోపు తన స్వంత డబ్బుతో పరిశుద్ధ పేతురు దేవాలయాన్ని ఎందుకు కట్టకూడదు?
  87. ఇంకా:- తమ పూర్ణ పశ్చ్చాత్తాపాన్నిబట్టి సర్వ పాపక్షమాపణ పొందటానికి, పరలోకభాగ్యాన్ని అనుభవించటానికి అర్హతపొందిన వాళ్ళకి, మళ్ళీ పోపు అదనంగా కొట్టేసేది, అనుగ్రహించేది ఏముంటుంది?
  88. ఇప్పుడు రోజుకు ఒక్కసారిచేస్తున్న పోపు ఇకపై రోజుకు వందసార్లుచేసి ప్రతీ విశ్వాసికి పాపక్షమాపణ్ణి, పరలోకభాగ్యాన్ని దయచేయటాని కంటే గొప్పదైన ఏ దీవెన సంఘానికొస్తుంది?
  89. తన పాపక్షమాపణ పత్రాలద్వారా డబ్బు సంపాదించాలనికాక ఆత్మల్ని రక్షించాలని పోపు అనుకుంటున్నప్పుడు వీటితో సమానమైన శక్తికలిగినవైన, తానిదివరలో మంజూరుచేసిన పాపక్షమాపణల్ని ఎందుకు రద్దుచెయ్యాలి?
  90. సంఘస్తులు లేవదీసిన ఈ వివాదాల్ని, సందేహాల్ని తగిన కారణాలు చూపించి తీర్చకుండా బలవంతంగా అణచివెయ్యాలనుకుంటే సంఘాన్ని పోపును వాళ్ళ శత్రువులు గేలిచేసేలా చేసి క్రైస్తవుల్ని దుఖపరిచినట్లవుతుంది.
  91. కాబట్టి పాపక్షమాపణ పత్రికలు పోపు అభిప్రాయాలకు అనుగుణంగా బోధించబడ్డప్పుడు ఈ అనుమానాలన్నీ వెంటనే తొలిగిపోతాయి, సమసిపోతాయి.
  92. కనుక శాంతి లేనప్పుడు శాంతి శాంతి అని చెప్పే ప్రవక్తలందరూ వెళ్ళిపోవాలి.
  93. సిలువ లేనప్పుడు క్రీస్తు ప్రజలకు సిలువ సిలువ అని చెప్పే ప్రవక్తలు ధన్యులు.
  94. శిక్షా విధుల ద్వారా, మరణం ద్వారా, నరకం ద్వారా తమ శిరస్సైన క్రీస్తును వెంబడించటంలో మెళకువకలిగి ఉండేలా క్రైస్తవులకు బోధించబడాలి.
  95. ఆ విధంగా శాంతి సమాధానం యొక్క అభయాన్ని బట్టికాక అనేక శ్రమలద్వారా పరలోకరాజ్యంలో ప్రవేశిస్తామన్న దృఢ నిశ్చయాన్ని కలిగుండాలి.

Source: మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు

Purgatory : స్వర్గానికి వెళ్ళే ముందు తమ పాపాలను పరిహరించే పాపుల ఆత్మలు నివసించే ప్రదేశం లేదా బాధల స్థితి.

the 95 these in telugu


ఈ వీడియో చూడండి,.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు